అన్ని సమస్యలకు సైన్స్‌తో పరిష్కారం

అన్ని సమస్యలకు సైన్స్‌తో పరిష్కారం లభిస్తుందని, శాస్త్రీయ పురోగతిపైనే దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుందని భారతరత్న, ప్రొఫెసర్‌ సీఎన్‌ఆర్‌ రావు తెలిపారు. తమిళనాడులోని అవినాశివలింగం వద్ద ఉన్న మహిళల హోం సైన్సెన్స్‌ ఉన్నత విద్యా సంస్థలో తన పేరుతో ఏర్పాటు చేసిన పరిశోధనా కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శాస్త్రీయ అభివృద్ధి వల్లనే చైనా, ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయని తెలిపారు. అబ్దుల్‌ కలాం మాదిరిగా యువత శాస్త్రీయ నైపుణ్యాలను పెంపొందించుకుని లక్ష్య సాధనకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. సైన్సుకు ఎలాంటి మతం లేదన్న సీఎన్‌ఆర్‌ రావు, శాస్త్రీయ అభివృద్ధితో అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన కలాం విగ్రహాన్ని  ఆవిష్కరించారు.