ఏపీ శాసన మండలి రద్దు‌ తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

 ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దు తీర్మానంపై శాసనసభలో ఇవాళ సాయంత్రం ఓటింగ్‌ నిర్వహించారు.  సభలో ప్రవేశపెట్టిన  మండలి రద్దు తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి రద్దు తీర్మానంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రసంగం అనంతరం మండలి రద్దు తీర్మానంపై ఓటింగ్‌ జరిపారు.  


'ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సీఎం నేతృత్వంలోని కేబినెట్‌ శాసనసభకు జవాబుదారీగా ఉంటుంది.  మండలి ఏర్పాటు చేసుకునే అధికారం, మండలి రద్దు అధికారం కూడా రాష్ట్రానికే ఇచ్చారు. 28 రాష్ట్రాలకు కేవలం 6 రాష్ట్రాల్లోనే మండలి ఉంది. రాష్ట్ర కేబినెట్‌ శాసనసభకే తప్ప.. మండలికి జవాబుదారికాదు.  మండలి చేసిన సవరణలు కూడా శాసనసభ ఆమోదించాల్సిన అవసరం లేదు. రాజకీయ కోణంతో మండలిలో బిల్లులు అడ్డుకుంటున్నారు. మండలి వల్ల ప్రజాప్రయోజనాలకు ఆటంకం కలుగుతోంది.  ఇలాంటి పరిస్థితుల్లో మండలి కోసం ప్రజాధనాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదు.  ప్రజా ప్రయోజనంలేని మండలి అవసరమా?  అని ఆలోచించాలి.  మండలి రద్దు చేస్తున్నామని చెప్పడం గర్వంగా ఉంది. మా పార్టీకి మండలిలో ఎక్కువ మందికి అవకాశం కల్పించే పరిస్థితి ఉన్నా  ప్రజా ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని' జగన్‌ పేర్కొన్నారు.